US student visa :  అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనుకునే భారత్, చైనా విద్యార్థులకు ఊహించని షాక్ తగిలింది. 2025 సంవత్సరంలో అమెరికా జారీ చేసిన F-1 స్టూడెంట్ వీసాల సంఖ్య దారుణంగా పడిపోయింది. వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత్, చైనాల నుంచి వచ్చే విద్యార్థుల వీసాల్లో భారీ తగ్గింపు నమోదైంది. ఈ ప్రభావం అమెరికాలోని యూనివర్సిటీలతో పాటు అక్కడి ఉద్యోగ రంగాంపైన, జాతీయ భద్రతపైన పడే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది.

అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థల్లో చేరే మొత్తం విదేశీ విద్యార్థులలో సగానికి పైగా భారత్, చైనా దేశాలకు చెందినవారే ఉంటారు. 2024-25 విద్యాసంవత్సరంలో అమెరికాలో మొత్తం 11.77 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండగా, అందులో ఇండియా నుంచి 3.63 లక్షల మంది, చైనా నుంచి 2.65 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. సాధారణంగా ప్రతీ ఏటా మే నుండి ఆగస్టు నెలల మధ్య కాలంలోనే అమెరికా అత్యధిక సంఖ్యలో స్టూడెంట్ వీసాలను జారీ చేస్తుంది.

అయితే, 2025 మే-ఆగస్టు కాలంలో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్-1 వీసాల సంఖ్య ఏకంగా 60 శాతం తగ్గిపోయి 22,149కి పడిపోయింది. గతంలో అంటే 2017-19, 2021-24 మధ్య ఇదే సమయంలో సగటున 55,717 వీసాలు జారీ చేయగా, 2024 లో 58,694 వీసాలు ఇచ్చారు. కానీ ఈసారి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక చైనా విద్యార్థులకు ఇచ్చే వీసాల్లో కూడా 46 శాతం కోత పడటంతో ఈసారి కేవలం 40 వేల 34 వీసాలు మాత్రమే లభించాయి.

ఈ వీసాల కోత వల్ల అమెరికాలోని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. కోర్సు పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు అమెరికాలోనే ఉండి ఉద్యోగం చేసుకునేందుకు ఈ ఓపీటీ అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఓపీటీ ద్వారా ఉద్యోగాలు చేస్తున్న వారిలో 70 శాతం మంది భారత్, చైనాలకు చెందిన వారే ఉన్నారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పనిచేస్తున్న విదేశీ నిపుణులలో భారతీయ విద్యార్థులదే అగ్రస్థానం. స్టూడెంట్ వీసాలు తగ్గడం వల్ల భవిష్యత్తులో అమెరికా ఐటీ, సాంకేతిక రంగానికి విదేశీ ఉద్యోగుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.